తెలంగాణలో ఫ్రెండ్లీ పోలిసింగ్… థర్డ్ డిగ్రీ హాహాకారాలు లైవ్ లో వినిపించిన ఎస్ఐ

SI Koteshwar rao

 

ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటే ఎందో అనుకున్నరు. కాని   పేట్ బషీరాబాద్ ఎస్ఐ కోటేశ్వరరావు కండ్లకు కట్టినట్లు చూపించిండు. అప్పు తీసుకొని ఎగ్గొట్టినొని ఒకాల్తా పుచ్చుకొని అప్పు ఇచ్చినొన్ని చితక్కొట్టిండు. అది కూడా నగరం నడిబొడ్డుల ఉన్న పోలీస్ స్టేషన్లోనే. కోటేశ్వరరావు ఎస్ఐ సార్ కు ఇంకో ప్రత్యేకత ఉంది…. అప్పు ఇచ్చినోని మనుషులను ఎలా టార్చర్ పెట్టింది మొత్తం ఎగ్గొట్టినోని మనుషులకు లైవ్ లో వినిపించిండు అది కూడా ఆయన ఫోన్ నుంచే. కాని ఇంత కొట్టినా అప్పు ఎగ్గొట్టినోడి మనిషి మాత్రం ఫిదా కాలే. అంతేనా ఇంకా కొడ్తే బాగుండు అని ఎస్ఐని అడిగిండు. ఇదంతా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగింది. ఇంత జరిగి ఆడియో టేపులతో పాటు మొత్తం ఆధారాలు బయటకు వచ్చేసరికి ఎస్ఐ ఉడాయించిండు. ఆతని మీద కేసు నమోదు చేసినమని పోలీసులు చెప్తున్నారు.

పోటీసులు ఇప్పుడు చెప్తున్న లెక్క ప్రకారం అసలు విషయం ఏందంటే. రియల్ ఎస్టేట్ వ్యాపారి శివప్రధీప్ పేట్ బషీరాబాద్ కు చెందిన రవీందర్ ప్రసాద్ లు ఫ్రెండ్స్ . రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే రవీందర్ ప్రసాద్ కు అవసరం ఉన్నప్పుడు 75లక్షలు శివప్రధీప్ ఇచ్చిండంట. ఆ పైసలు ఇయ్యకుండ రవీందర్ తిప్పుతున్నడు. ఈ విషయంలో శివప్రధీప్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిండు. కాని ఇది సివిల్ లొల్లి అని పోలీసులు పట్టించుకోలేదు. వివాదం ముదిరింది శివప్రధీప్ డబ్బులు ఎలాగైనా వసూలు చేసుకొవాలన్న ఆలోచనలతో రకరకాల వత్తిల్లు చేశిండు. దీంతో రవీందర్ ప్రసాద్ తనకు అన్నిరకాలుగా సహకరించే పేట్ బషీరాబాద్ ఎస్ఐ కోటేశ్వరరావును ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఎస్ఐ శివప్రధీప్ మనుషులను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న బాలాజీ హస్పిటల్ దగ్గరకు రప్పించిండు. వెంటనే వారందర్నీ పోలీస్ స్టేషన్ కు తరలించిండు. ఇక పోలీసు మార్క్ ట్రీట్మెంట్ మొదలు పెట్టి అప్పు ఎందుకిచ్చాంరా బాబు అనుకునేలా చేశాడు. ఇంతటితో ఆగకుండా రవీందర్ ప్రసాద్ మనిషిగా భావిస్తున్న అనీల్ అనే వ్యక్తికి వీరిని టార్చర్ చేస్తున్నప్పుడు లైవ్ లో ఆడియో వినిపించాడు. చివరగా అయ్యగారు అనీల్ ను అడిగాడు “టార్చర్ చాలా” అంటూ . దానికి అనీల్ స్పందన “అంతేనా” ? . ఇందులో ఇంకో కసమెరుపు ఉంది. అక్రమంగా పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయిన వారిలో ఎవరో కొందరు ఆంధ్రోళ్లు ఉన్నట్లున్నరు. వారితో ఎస్ఐ “ఎమండీ హైదరాబాద్ చుడ్డానికి వచ్చారా ..? హైదరాబాద్ పోలీసుల దెబ్బలు కూడా చూసి వెళ్లండీ” అంటూ చేసిన కామెంట్స్ కూడా ఇనిపిస్తున్నయ్ .

తెలంగాణ పోలీసుల పరువు తీసిన ఈ ఎస్ఐ వ్యవహారం మొత్తం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు తీరికగా స్పందించారు. అతని పై చర్యలు తీసుకుంటామని చెప్పిండ్రు. ఇదంతా జరిగే లోపు ఎస్ఐ కోటేశ్వరరావు జంప్ అయ్యాడు. ఇప్పుడు ఎస్ఐ కోసం గాలిస్తున్నామంటున్నారు పోలీసోల్లు.


Other News